మాడపాటి హనుమంత రావు 22.01.1885 - 11.11.1970 మా మాతామహుల జీవితం ఒక తెరచిన పుస్తకం వంటిది. తెలంగాణాంధ్ర ప్రజలందరికి వారు సుపరిచితులే. ఈ నాటికి కూడా వారందించిన సమాజసేవా కార్యక్రమాలు, భాషోద్యమాలు, గ్రంధాలయోద్యమాలు, స్త్రీ విద్యకై వారు చేసిన కృషి మొదలైనవి ఎందరో మహానుభావులు వ్యాసాల, రచనల రూపంలో అందజేస్తునేవున్నారు. మాకు మాతాత గారితో గల అనుబంధము, అనుభవాలను, మా సంతతికి తెలియచేయాలనే ఉద్దేశమే ఈ వ్యాసానికి ప్రేరణ నిచ్చింది. కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా, ఆనాటి బ్రిటీష్‌పరిపాలనా ప్రాంతానికి, నైజాం పరిపాలనకు సరిహద్దు ప్రదేశం. నిస్వార్థంగా సమాజాభివృద్ధికై కృషి చేసిన, అయ్యదేవర కాళేశ్వరరావు, కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఈ ముగ్గురూ నందిగామకు చెందినవారగుట ఒక విశేషం. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన మా తాతగారు, అన్న తిరుమలరావు, తల్లి వెంకట సుబ్బమ్మ, మేనమామలైన జమలాపురం వెంకట్రావు, రామచంద్రరావు వద్దకు చేరారు. హనుమంతరావు తాతగారు చదువు కొంత వరకు సూర్యాపేటలోనే సాగింది. మేనమామలు వీరిని ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించారు. వీరు యుక్త వయస్కులయ్యే నాటికి మేనమామలు కాలధర...