ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మా మనస్సులో – మాతామహులు – మాడపాటి హనుమంతరావు గారు

 

మాడపాటి హనుమంత రావు
 22.01.1885 - 11.11.1970



మా మాతామహుల జీవితం ఒక తెరచిన పుస్తకం వంటిది. తెలంగాణాంధ్ర ప్రజలందరికి వారు సుపరిచితులే. ఈ నాటికి కూడా వారందించిన సమాజసేవా కార్యక్రమాలు, భాషోద్యమాలు, గ్రంధాలయోద్యమాలు, స్త్రీ విద్యకై వారు చేసిన కృషి మొదలైనవి ఎందరో మహానుభావులు వ్యాసాల, రచనల రూపంలో అందజేస్తునేవున్నారు. మాకు మాతాత గారితో గల అనుబంధము, అనుభవాలను, మా సంతతికి తెలియచేయాలనే ఉద్దేశమే ఈ వ్యాసానికి ప్రేరణ నిచ్చింది.

కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా, ఆనాటి బ్రిటీష్‌పరిపాలనా ప్రాంతానికి, నైజాం పరిపాలనకు సరిహద్దు ప్రదేశం. నిస్వార్థంగా సమాజాభివృద్ధికై కృషి చేసిన, అయ్యదేవర కాళేశ్వరరావు, కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఈ ముగ్గురూ నందిగామకు చెందినవారగుట ఒక విశేషం.

బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన మా తాతగారు, అన్న తిరుమలరావు, తల్లి వెంకట సుబ్బమ్మ, మేనమామలైన జమలాపురం వెంకట్రావు, రామచంద్రరావు వద్దకు చేరారు. హనుమంతరావు తాతగారు చదువు కొంత వరకు సూర్యాపేటలోనే సాగింది. మేనమామలు వీరిని ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించారు. వీరు యుక్త వయస్కులయ్యే నాటికి మేనమామలు కాలధర్మం చెందారు. తాతగారికి చదువుపై గల శ్రద్ధ, ఆసక్తులను గ్రహించిన తిరుమలరావు వారిని పై చదువులు చదివించారు. అన్న-వదినలు, బంధువులు ఎంతో అభిమానంగా తాతగారిని హనుమంతరాయుడు అని పిలుచుకునేవారు.

వదిన వెంకటరావమ్మ అంటే హనుమంతరావుగారికి ఎనలేని గౌరవం. తల్లి, మేనమామలు, అన్న తిరుమలరావు తనకోసం పడిన తపన, శ్రమ వారు పెంచిన తీరు చిన్నప్పటి నుంచే గమనిస్తూ పెరిగిన మా తాతగారిలో ఓర్పు, సహనం, నిదానం, నిరాడంబరత, నిస్వార్థం, ఎదుటివారి మాటను గౌరవించివినటము మొదలైన గుణాలన్నీ వారి స్వయం నిర్మిత వ్యక్తిత్వానికి సోపానాలయి, వారిని అజాతశత్రువుగా నిలిపాయి.



అన్నపూర్ణమ్మ, హనుమంత రావు

             

1904 సం॥లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మీర్‌మున్షీ ఉద్యోగంలో చేరారు. ఆ సంవత్సరమే వారి వివాహము మేనమామ రామచంద్రరావు కుమార్తె, అన్నపూర్ణమ్మతో జరిగింది. వారి సంతానమే మా అమ్మ, లక్ష్మీబాయి. అందరూ ప్రేమగా బుజ్జమ్మ అని పిలవటం చేత ఎక్కువగా ఆ పేరు స్థిరపడింది. 

నిజాం ప్రభుత్వ అనువాదకునిగా ఉద్యోగం చేస్తూనే “లా” చదవటం మొదలు పెట్టారు. 1918 వరకు ప్రశాంతంగా సాగిపోయిన వారి సంసార జీవనంలో, అన్నపూర్ణమ్మ అకాలమరణం వారిని క్రుంగదీసింది. ఎంతో మనో నిబ్బరంగా మా తాతగారు పరిస్థితులను తట్టుకొని జీవనం మొదలు పెట్టారు. కూతురు లక్ష్మీబాయిని, అన్న-వదినలు ఎర్రుపాలెం తీసుకువెళ్ళి ఆలనాపాలనా చూసుకోసాగారు. పెద్దనాన్న గారి కుమారుడు రామచంద్రరావు, చెల్లెలు బుజ్జమ్మను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అన్నా-చెల్లెల మధ్య ప్రేమాభిమానాలు మెండు. మా తాతగారు, కూతురును హైదరాబాద్‌తెచ్చుకొని ఆరు నెలలుంచుకునేవారు. ట్రూప్‌బజార్‌లోని పరోపకారిణి
పాఠశాలలో కూతుర్ని చేర్పించారు. కూతురు ఎర్రుపాలెంలో వున్నప్పుడు చాట్రాతి లక్ష్మీనరసమ్మ గారు (వరంగల్లు వాస్తవ్యురాలు) సంస్కృతాంధ్రములు నేర్పించెడివారు. స్రీ విద్యను హనుమంతరావు గారు కుటుంబమునుంచే ఆచరణలో పెట్టినట్లున్నారు. వీరి పునర్వివాహము గోళ్ళమూడి హనుమంతరావు (నందిగామ) కుమార్తె మాణిక్యమ్మతో జరిగింది. వివాహానంతరము ఆమెను కూడా నారాయణగూడ పాఠశాలలో చదివించారు. తాతగారు చెప్పిన ప్రతిపని ఆచరణలో పెట్టేవారు.



దత్తాత్రేయ శర్మ, వరలక్ష్మి
                 

కూతురు లక్ష్మీబాయి, మా అమ్మగారు, వివాహము గుంటూరు వాస్తవ్యులు, గోవిందరాజు వేంకట శ్రీనివాసరావు పంతులు రెండవ కుమారుడు వేంకట దత్తాత్రేయ శర్మ తో (మా నాన్నగారు) జరిపించారు. పెళ్ళైనతరవాత అత్తవారు మా అమ్మ పేరు వరలక్ష్మి అని మార్చారు. 



హనుమంతరావు గారు, భార్య మాణిక్యమ్మ
వెనుక: దత్తాత్రేయ శర్మ, కుమారుడు సుకుమార్, వరలక్ష్మి




తండ్రి ప్రభావం మా అమ్మగారిపై ఎంతగానో వుండేది. ఆమెలో కూడా ఓర్పు, సహనం, నిరాడంబరత, మానవత్వ భావనలు ప్రస్ఫుటంగా కనబడేవి. కులమతాలు, పదవులు, హోదాలకన్నా మానవత్వానికే ఎక్కువ విలువ నిచ్చేవారు. మా చిన్నతనంలో అన్యకులాల వారు మా ఇంటనే వుండి చదువుసాగించారు. వారి వసతి, భోజనాలు అన్నీ మా అమ్మ స్వయంగా చూసుకునేవారు. విశాలధృక్పధము, తోటివారికి చేయూతనిచ్చే స్వభావం గల మా నాన్నగారికి, అమ్మ సరియైన జోడి అయ్యింది.

1948-49 ప్రాంతాలలో రజాకార్‌దాడులలో ఎంతోమంది హైదరాబాద్‌ని విడిచి బతికుంటే బలుసాకు అని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మా అమ్మ బంధువులు, తెలిసిన వారు ఆ సమయంలో గుంటూరు వచ్చారు. ఒక ప్రముఖ పత్రికాయజమాని తన కుటుంబంతో సహా రాత్రికి రాత్రి గుంటూరు వచ్చి తలదాచుకున్నారు. వీరందరికి మా నాన్నగారు వసతి, ఉద్యోగాల ఏర్పాట్లకు సహాయం చేశారు.

నేను హైదరాబాద్‌లో 1957-1959 ప్రాంతాలలో “లా” చదువుతూ వుండేవాడిని. నాకు వీలయినప్పుడు వెళ్లి తాతగారితో సమయం గడుపుతూ వుండేవాడిని. వారితో జరిపిన ప్రతి సంభాషణ స్ఫూర్తిదాయకం. వారు నాతో క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ, నిరాడంబరత, పొదుపు, ఆత్మసంయమనం వంటి లక్షణాలు కలిగి వుండాలని మాటలలో సందేశాత్మకంగా చెప్పేవారు. ముఖ్యంగా న్యాయవాద వృత్తిని ధర్మపరంగా ఆచరించాలని, వ్యక్తులను దోచి ధనార్జనకూడదని చెప్పేవారు.

తాతగారికి మాపై గల ప్రేమాభిమానాలు మాటలలో కన్నా చేతలలో ఎక్కువ. చిన్నప్పుడు మనుమలు, మనుమరాళ్ళు హైదరాబాదు వెళ్ళినప్పుడు నైజాం కోటలు, కట్టడాలు చూపించేవారు. మా అన్నయ్యకు, ప్రాగా టూల్స్‌లో ఉద్యోగం వచ్చిన మొదటిరోజు తనే స్వయంగా చేర్పించారు. మా చెల్లెలు బెంగుళూర్‌లో వుండేది. తాతగారు పనిమీద ఆ ఊరు వెళ్ళినప్పుడు మనుమరాలి దగ్గరికి వెళ్ళి సమయం గడిపి వచ్చేవారు. తాతగారు ఉర్దూ, అరబ్బీ, పార్శీ భాషలు అన్నీ మాట్లాడేవారు. మా చెల్లెల్ని “కన్నడ దేశంలో వున్చావు, కన్నడ మాట్లాడి వినిపించు,” అని అడిగి మాట్లాడించుకునేవారు. మునిమనవలు కాన్వెంట్లో దువుతున్నారని వారి చేత ఇంగ్లీషు మాట్లాడించుకునేవారు. చిన్నవారితో, పెద్దవారితో అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడేవారు. ఇవన్నీ మాకు ఎంతో ఆనందకరమైన అనుభూతులు.

మా అమ్మగా రిని చూడటానికి అప్పుడప్పుడు గుంటూరు వచ్చేవారు. ఆయన వచ్చే ముందు మా ఇంటి దగ్గర వీధులు శుభ్రం చేసి డి.డి.టి. చల్లేవారు. ఇంటి ముందు పోలీసు బందోబస్తు ఉండేది. ఇవన్నీ మా ఇంట్లో చిన్న వారికి ఉత్సాహంగా వుండేవి. తాతగారిని కలవటానికి స్థానిక పెద్దలు, శాతన సభ్యులు, రాజకీయ నాయకులు వస్తే, వారితో ఆదరంగా మాట్లాడి, తన రాక కేవలం వ్యక్తిగతమని, ప్రభుత్వ కార్యం కాదని చెప్పేవారు. “నొప్పింపక, తానొవ్వక” సూత్రం ఆయనది.

ఆ సమయంలో మా అమ్మగారితో, పిల్లలతో కాలక్షేపం చేసేవారు. చిన్న పిల్లలు చెప్పే మాటలు కూడా శ్రద్ధగా వినేవారు. మా తమ్ముడు చేత చందమామ కథలు అడిగి చెప్పించుకునేవారు. వాటిలో ముఖ్యంగా, “నేలమీద నడిచేపడవ”, “నీలకంఠ పక్షి” కథలు మరీ మరీ అడిగి వినేవారు.

శాసనమండలి అధ్యక్ష పదిలో వున్నప్పుడు బరకత్‌పూరా చమన్‌దగ్గర వున్న బంగళా వారి నివాసం. అమ్మతోపాటు శలవులకు వెళ్ళినపుడు తోటలో ఆడుకోవటం, జారుడు బండ జారటం, ద్రాక్ష తీగలు లెక్కపెట్టడం, చిన్న వారికి ఎంతో సరదాగా వుండేది. ఒకసారి తాతగారు మనమరాండ్రుల ఆటలు చూస్తూ వున్నారు. ఎవరిదో గాలిపటం ఎగురుతూ, దారం తెగి వీళ్ళు ఆడుకునే స్థలంలో పడింది. మా చెల్లెలు, “ఆ గాలి పటం మన దగ్గరికి వచ్చింది, మనం తీసుకుని ఆడుకోవచ్చా?” అని అడిగింది. 

ఆటలు చూస్తున్న తాతగారు, “వద్దమ్మా, అది మనది కాని వస్తువు. ముట్టుకోవద్దు. పాపం, ఎవరిదో. వాళ్ళు పోయిందని వెతుక్కుంటారు,” అంటూ అతి సౌమ్యంగా చిన్నగా చెపుతుండగానే, గాలిపటం తాలూకు పిల్లలు వచ్చి అడిగి తీసుకెళ్ళారు. ఈ సంఘటనలన్నీ చిన్న పిల్లల మనస్సుల్లో ముద్ర వేశాయి.

ఇలాగే ఒకసారి తాతగారు పనివాళ్ళని పిలువటానికి ఏర్పాటు చేసిన కాలింగ్‌బెల్‌ను పిల్లలు సరదాగా కొట్టడం, పనివాళ్ళు పరిగెత్తుకు రావటం జరిగింది. అప్పుడుకూడా, చిన్న వాళ్ళని కూర్చోపెట్టుకొని నెమ్మదిగా, కాలింగ్‌బెల్‌కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని, వాళ్ళు ఆకలేసి అన్నం తింటూవుంటారు, లేక నిద్రపోతూవుంటారు, లేకపోతే వారి పనులు చూసుకుంటూ ఉంటారు. మనము వారిని ఇబ్బంది పెట్టకూడదని, చక్కగా నిదానంగా క్రమశిక్షణను తెలియచేసేవారు. కొంచెం పెద్ద వారయి వెళ్ళిన వారిచేత వార్తా పత్రికలు చదివించి, వారి ఉచ్చారణను అభినందించటము, సరిచేయటము చేసేవారు.

బంధువుల పైన కూడా ఆదరాభిమానాలు కలిగి వుండేవారు. మా అమ్మమ్మ అన్నపూర్ణమ్మ మరణానంతరం కూడా, మేనమామల వైపు బంధువర్గమును ఎర్రుపాలెం, మధిర వెళ్ళినప్పుడు వారిని పలకరించే వారని చెపుతూఉంటారు. ఈనాటికి మా అమ్మమ్మవైపు బంధువులు, గుంటూరు వచ్చి మమ్మల్ని
కలిసివెళుతూ వుంటారు.

ఒక విధంగా మేమంతా ఎంతో అదృష్టవంతులమని చెప్పగలను. మాతామహులు, పితామహులు ఇద్దరు సమఉజ్జీలు. ఇరువురు న్యాయవాదులు. కష్టపడి పైకి వచ్చినవారు. పితామహులు, గోవిందరాజు వేంకట శ్రీనివాసరావు పంతులుగారు “మాధవసేవే మనిషి జన్మకు సార్థకత” అని భావించి దైవకార్యాలు, అన్న్నదానాలు, ధర్మసత్రాలకు విరాళాలు, సాధుపురుషులను సత్కరించుటవంటి, కార్యక్రమాలు చేసేవారు.

మాతామహులు, మాడపాటి హనుమంతరావు గారు “మానవసేవే మాధవసేవ” అని భావించి ఆ మార్గాన్ని అనుసరించారు. ఆంధ్ర పితామహులుగా ప్రజల మనస్సులలో నిలిచిపోయారు.

1955లో “పద్మభూషణ్‌” బిరుదు ప్రధానానికి తాతగారు ఢిల్లీ వెళ్ళలేక పోయారు. అప్పటి రాష్ట్రపతి, డాక్టర్‌రాజేంద్ర ప్రసాద్‌గారు, 1956 జూలై నెల 5వ తారీకున, బొలారం (హైదరాబాద్) లోని రాష్ట్రపతి నిలయంలో బిరుదు పతకమును ప్రధానం చేశారు. సభ ముగిసిన తరువాత తాతగారు బయటకు వస్తున్నప్పుడు, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌గారు కూడా వచ్చి వీడ్కోలు చెప్పారుట.

నిజాయితి, నిస్వార్థం, మానవత్వం మొదలైన గుణాలు తరగని సంపదలని నిరూపించి, మార్గదర్శకులైన మహోన్నత వ్యక్తికి వారసులమైనందుకు వారికి మా ప్రణామాలు.



గోవిందరాజు మదన్ మోహన్































































కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆత్మీయులు కొత్తపల్లి సుబ్బరామయ్య గారు

 సుబ్బరామయ్యగారి గురించి రాయటం అంటే, నాకు ఒకరకంగా సాహసం తో కూడిన పని అనిపిస్తుంది. ఈయన వెండితెర నాయకుడు, గాయకుడు కాదు. కాని, ‘సామాజిక స్పృహ’ కలిగిన మానవతావాది. ఇటువంటి వ్యక్తి అనామకుడుగా సమాజంలో నిలిచిపోకూడదు అనే భావన ఈ నా రచనకు నాందిపలికింది. 1942వ  సంవత్సరమున - సంస్కృతి గ్రంథమండలి - చెన్నపట్నం వారు, నేటి జపాన్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తక రచయిత మరెవరోకాదు, సుబ్బరామయ్య గారు. అందులో ఆయన తనని గురించి విషయాలు కొన్ని తెలిపారు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో (దాదాపు 110 సంవత్సరాల క్రితం) సుబ్బరామయ్య గారి తల్లిదండ్రులు ఒంగోలు నుంచి చెన్నపట్నంకి  వచ్చి జీవనం సాగించారు. అతిసామాన్యమైన మధ్యతరగతి కుటుంబం వారిది. ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రమే. వీరి పై చదువులనాటికి ఆర్ధిక పరిస్ధితి బాగా కుంటుపడ్డది అని చెప్పాలి. ఆయన ఫిబ్రవరి 1వ తేదీ, 1910వ సంవత్సరంలో పెరంబూరు లో జన్మించారు. బాల్యం అంతా అక్కడే గడిచింది. విద్యాభ్యాసం అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు లో పూర్తి చేసుకొని, 1928 నాటికి చెన్నపట్నం వచ్చి ఉద్యోగంలో చేరారు.  అవి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతున్న రోజులు, 1931వ ప్రాంత...