సుబ్బరామయ్యగారి గురించి రాయటం అంటే, నాకు ఒకరకంగా సాహసం తో కూడిన పని అనిపిస్తుంది. ఈయన వెండితెర నాయకుడు, గాయకుడు కాదు. కాని, ‘సామాజిక స్పృహ’ కలిగిన మానవతావాది. ఇటువంటి వ్యక్తి అనామకుడుగా సమాజంలో నిలిచిపోకూడదు అనే భావన ఈ నా రచనకు నాందిపలికింది.
1942వ సంవత్సరమున - సంస్కృతి గ్రంథమండలి - చెన్నపట్నం వారు, నేటి జపాన్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తక రచయిత మరెవరోకాదు, సుబ్బరామయ్య గారు. అందులో ఆయన తనని గురించి విషయాలు కొన్ని తెలిపారు.
బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో (దాదాపు 110 సంవత్సరాల క్రితం) సుబ్బరామయ్య గారి తల్లిదండ్రులు ఒంగోలు నుంచి చెన్నపట్నంకి వచ్చి జీవనం సాగించారు. అతిసామాన్యమైన మధ్యతరగతి కుటుంబం వారిది. ఆర్ధిక పరిస్ధితి అంతంతమాత్రమే. వీరి పై చదువులనాటికి ఆర్ధిక పరిస్ధితి బాగా కుంటుపడ్డది అని చెప్పాలి.
ఆయన ఫిబ్రవరి 1వ తేదీ, 1910వ సంవత్సరంలో పెరంబూరు లో జన్మించారు. బాల్యం అంతా అక్కడే గడిచింది. విద్యాభ్యాసం అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు లో పూర్తి చేసుకొని, 1928 నాటికి చెన్నపట్నం వచ్చి ఉద్యోగంలో చేరారు.
అవి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతున్న రోజులు, 1931వ ప్రాంతము. ఎక్కడ చూసినా, విన్నా, స్వాతంత్ర్యసమర నినాదాలే. స్వతహాగ దేశభక్తి గలిగిన సుబ్బరామయ్యకు ఈ ఉద్యమ నినాదాలు చెవులనంటినాయి. ఉద్యోగానికి రాజీనామాచేసి, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరితోపాటు నిర్భంధాలు, శిక్షలు అనుభవించారు.
1932-1937 ప్రాంతంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరి యం.ఎ. పట్టాను పొందారు. కొంతకాలం అడయార్ లోని దివ్యజ్ఞాన సమాజం (The Theosophical Society) వారి పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసారు. ఆతరువాత, యల్.టి. పట్టాను పొందారు. విద్యావనం, కార్పోరేషన్ పాఠశాల, నవ్యభారత్ మొదలైన పాఠశాలలో పనిచేశారు. సుబ్బరామయ్య గారిలో స్వతంత్రతా భావాలు, నీతి, నిజాయతీలు ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు. బహుశ కొద్దిమందికి వృత్తిరీత్యా అందుకే దూరం అయ్యారేమో కూడ. కాని ఈ లక్షణాలే వారిని ఎంతోమందికి ‘ఆత్మబంధువు’ని చేశాయి.
![]() |
| పండిట్ నెహ్రు, సుబ్బరామయ్య గారు |
బెనారస్ లో చదివేటప్పుడు వీరికి గోవిందరాజు చలపతి రావు గారు, కస్తూరి సూర్యప్రకాశ రావు గారు మంచి స్నేహితులయ్యారు. ఈ స్నేహాన్ని ఆయన జీవితకాలం వారితో, వారి కుటుంబాలతో నిలుపుకున్నారు.
గోవిందరాజు వెంకట చలపతి రావు గారు, మా నాన్నగారికి స్వయానా తమ్ముడు. ఆ రకంగా సుబ్బరామయ్యగారు మాకు సుపరిచితులు. మా నాన్నగారిని అన్నయ్య అని, మా అమ్మ ని వదిన అని ఆప్యాయంగా పిలిచేవారు. మా అందరికి ఆయన దగ్గర ఎంతోచనువు. గుంటూరు వచ్చినప్పుడల్లా ఆయన మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందర్ని చూసి వెళ్లే వారు.
సుబ్బరామయ్యగారి వేషధారణ చాల ప్రత్యేకంగా ఉండేది. మోకాలు క్రిందవరకు, వదులుగా వుండే పొడుగాటి ఖద్దరు లాల్చి. దానిలో నుంచి ఆయన చేతులు కూడా కనబడేవి కావు. బాగా వొదులుగా ఉండే ఖద్దరు పైజామ. లాల్చి పైభాగాన ఎడమవైపు ఒక జేబు, అందులో సిరాకలము, పక్కజేబులో అతిపెద్ద జేబు రుమాలు, దానికి ఆకుపచ్చ అంచులు, అలాంటిదే గళ్ళ తువ్వాలు, భుజానికి పొడుగాటి ఖద్దరు సంచి, పూర్తిగా నెరిసిపోయిన చింపిరిజుట్టు, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే తెల్లని పలువరుస, నిండైన నల్లని విగ్రహం. సుబ్బరామయ్య గారు అంటే ఈ రూపమే మాలో మెదిలేది.
లాల్చీ జేబుల నిండా చాక్లెట్లు. పెద్దలు, పిల్లలు, ఆటో డ్రైవర్లు, రైల్వే పోర్టర్లు, పోలీసు కాన్స్టేబుల్స్, తోటి ప్రయాణీకులు అందరికి ఇవి పంచేవారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, వారిలో పుస్తక పఠనం పెంచటానికి చాక్లెట్లతో పాటు, లక్కపిడతలు పుస్తకం ఇవ్వటం ఆయనకి పరిపాటి. తనకున్నది అందరికి తృప్తిగా పెట్టటం, ఆనందాన్ని అందరితో పంచుకోవటం ఆయనకు జన్మతః వచ్చిన సంస్కారం. పోతన భాగవతం పద్యాలు, శ్రీనాథుని పద్యాలు, వేమన పద్యాలు అనర్గళంగా అందరికి చెబుతుండేవారు.
ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ దీక్ష, పట్టుదలతో చదువుసాగించారు. బెనారస్ లో చదివే రోజుల్లో శెలవులలో విద్యార్థులంతా ఇళ్ళకు వెళ్ళేవారు. కాని, సుబ్బరామయ్య గారు శెలవులలో కూడా అక్కడే ఉండేవారు. ఒకసారి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మదన్ మోహన్ మాలవ్య గారికి ఈ విషయం తెలిసింది. ఆయన వచ్చి సుబ్బరామయ్య గారితో మాట్లాడి తన సొంత ఖర్చుతో వీరికి వసతి, భోజన సదుపాయము, ఉన్ని దుస్తులు, అన్నీ అమర్చి వెళ్లారట. ఇవన్నీ సుబ్బరామయ్య గారే స్వయంగా చెప్పారు. ఈ ఆర్థిక పరిస్థితి గతులే ఆయనలో పోరాటపటిమను, ఆత్మస్థైర్యాన్ని, స్వతంత్ర భావాలను పెంచి, ఒక విశిష్టమైన వ్యక్తిగా తయారుచేశాయనుకుంటాను.
1943-44 లలో కల్చరల్ బుక్ ప్రైవేట్ లిమిటెడ్ అని సంస్కృతి ప్రచురణ పేరిట ఒక సంస్ధను స్థాపించారు. రాజకీయ, సాంఘిక పరిస్థితులకు సంబంధించిన పుస్తకాలను ఎన్నింటినో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ప్రచురించారు. ఈ సంస్ధ మౌంట్ రోడ్, మీరాన్ సాహిబ్, రెండవ వీధి లో ఉండేది. తెలుగులో అపూర్వ గ్రంథములు, పిల్లల పుస్తకాలు ప్రచురించారు. విలియం బ్రౌన్ వారి తెలుగు-ఇంగ్లీషునిఘంటువును ముద్రించారు. ఆయన ప్రచురణలో చెప్పుకో తగ్గ విషయము ఏమిటంటే, ఏనాడు కాగితము యొక్క నాణ్యతను తగ్గించలేదు. 'రాశి కాదు వాసి ప్రధానం' అని తలచారు.
ఈ సంస్థ దాదాపు 25 సంవత్సరములు (1952-75) రాజకీయ, సాంఘిక ప్రచురణలతోపాటు, ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థుల కొఱకు కూడా (5వ తరగతి-8వ తరగతి) తెలుగు, ఇంగ్లీషు భాషలలో అనుబంధ పాఠాలతో సాంఘిక విద్య మరియు ఉపవాచకాలు ముద్రించారు.
ఆ రోజులలో, రాబోయే విద్యా సంవత్సరానికి కావలసిన పాఠ్య పుస్తకాలను ఆయా విద్యాసంస్థల యాజమాన్యము తమ వద్ద నున్న ఉపాధ్యాయుల చేతనే ఎంచుకునేవారు. సుబ్బరామయ్యగారు వాటిని ముద్రించి, నమూనా ప్రతులను తీసికొని ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగేవారు. శ్రీకాకుళం నుంచి కోస్తా జిల్లాల వరకు, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లి, చిన్న, పెద్ద పాఠశాలలన్నింటిని సందర్శించేవారు. ఈ సంస్థకు విక్రమ విభాగం లేదు. తన బంధువులు, స్నేహితుల ఇళ్ళలో ఉండి ఈ పనులను పూర్తి చేసుకునే వారు. ఆయనలో గల స్నేహతత్వము, అందరికి ఆయనను ఆప్తునిగా చేసింది. ఈ ఒంటరి బాటసారి ప్రయాణంలో ఆయన వెంట ఒక హోల్డాల్, తోలుపెట్టె ఎప్పుడూ తోడుగా ఉండేవి.
షుమారు 1975వ సంవత్సరం తరువాత, విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయి. పాఠ్యపుస్తకాల విషయంలో యాజమాన్యం వారి కన్నా ప్రభుత్వం అనుసరించిన విధానాలకి ప్రాధాన్యత పెరిగింది. క్రమంగా ప్రచురణకర్తలకు స్వేచ్ఛ, స్వతంత్రలు సన్నగిల్లాయి. వీటికి తోడు ధరలపెరుగుదల, ద్రవ్యోల్ల్బణం, కాగితాల కొఱత, వేతనాలలో మార్పులు, కార్మికుల కొఱత చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు సంస్థపై ఎక్కువ ప్రభావం చూపాయి. వరుసగా కంపెనీకి వస్తున్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని ‘కంపెనీ లా’ చట్ట ప్రకారము సంస్థను మూసివేయవలసిందిగా బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 1980-1986 మధ్యకాలంలో ప్రెస్సును అమ్మివేశారు. ఇంగ్లీషు, తెలుగు టైపు సెట్టింగ్ సామాగ్రిని, తన సొంత లైబ్రరీ లోని పుస్తకాలను అమ్మివేశారు.
కొందరు పరిచయస్తుల వలన కలిగిన అవమానాలు ఆయనకి ఏనాడు జీవితంలో మనసుకి పట్టలేదు. కొందరు ఆయన స్థితిగతులు భేరీజు చేసి నిర్లక్ష్యం చేసినప్పుడు కూడా ఆయన చలించలేదు. అన్నిటికి ఒక చిరునవ్వే సమాధానంగా ఉన్న సుబ్బరామయ్యగారు 'సంస్థ' మూసివేయడంతో మానసికంగా కృంగిపోయారు. అలుపెరగని ఆ జీవిలో అలసట కనపడింది. సుబ్బరామయ్య - ఛాయ, ప్రచురణ సంస్థ - ప్రచ్ఛాయ.
వారి ప్రచురణలు కొన్ని ఉదాహరిస్తున్నాను:
1. ప్రపంచ చరిత్ర - పండిట్ నెహ్రూ, అనువాదం చింతా దీక్షితులు
2. నేటి చైనా - పింగళి పరశురామయ్య
3. లెనిన్ - క్లారా జెట్కిన్
4. హిందూ పద్-పాదషాహి - వినాయక్ సావర్కర్
5. ఇండియా స్వాతంత్ర సమస్య - డి.యస్. ప్రిట్
6. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధాన గాథ - ఉత్తమ్ చంద్
7. గాంధీతో ఒక వారం - లూయి ఫిషర్
8. సామ్రాజ్యం - లూయి ఫిషర్
9. మహమ్మదీయ రాజ్యాలలో జాతీయ వికాసం - కాళీపట్నం కొండయ్య
10. నాగరికత చరిత్ర - సి. ఇ. యం. జోడ్
11. జీవితాదర్శం - చలం
12. విజ్ఞాన శేఖరులు - కస్తూరి సూర్య ప్రకాశ రావు
13. విజ్ఞాన భాస్కరులు - కస్తూరి సూర్య ప్రకాశ రావు
14. సర్దార్ పటేల్ - టి.బదరీనారాయణ్
15. నా చిన్నప్పుడు - బద్దెపూడి రాధాకృష్ణమూర్తి
16. వీర స్వర్గం - గాంధీజీ
17. ఫ్రాన్స్ పతనం - ప్రతాప రామకోటయ్య
18. నాజి శ్రేణుల వెనక - కామ్రేడ్ తమ్ముల
19. భారత కమ్యూనిస్టు పార్టీ లో లుకలుకలు - శశికాంత్
20. బోల్షివిజం - బెర్ట్రాండ్ రస్సెల్
21. మన వారసత్వం - హుమాయూన్ కబీర్
చిన్న పిల్లల పుస్తకాలు
1. లక్కపిడతలు - చింతా దీక్షితులు
అపూర్వ గ్రంథములు
1. రతి రహస్యము - ముష్టిపల్లి సోమనాథుడు
2. తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు - విలియం బ్రౌన్
ఆయన నమ్మిన, ఆచరించిన నీతి, నిజాయతి విలువలను ఏనాడు వృత్తిలో వదలలేదు. అవి ఆయన ప్రవృత్తిలో కూడా కనబడతాయి. ఎంతో మంది రాజకీయ నాయకులు, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు సుబ్బరామయ్య గారికి పరిచితులు. అందులో కొందరు ఆప్తులు కూడా ఉన్నారు. వారంతా ఈయనతో ఎంతో చనువుగా ఉండేవారు. శ్రీ అచ్యుత్ పట్వర్ధన్, శ్రీ హేమేన్ బరువాలతో సుబ్బరామయ్య గారికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. తరిమెల నాగిరెడ్డి గారు (కమ్యూనిస్టు పార్టీ నాయకులు) సుబ్బరామయ్య గారికి అత్యంత సన్నిహితులు. ఇలా ఎంతో మంది ఉన్నత పదవులలో ఉన్నవారు స్నేహితులుగా ఉన్నప్పటికి ఈయన ఏనాడు తనకు గాని, తన ప్రచురణ సంస్థకు గాని వారి సహాయ సహకారములు కోరలేదు. స్నేహంలో స్వార్థపూరిత అవసరాలకు తావు ఇవ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే 'చెలిమి' కి 'చెద' పట్టనీయని వ్యక్తి.
పండిట్ నెహ్రూ రాసిన ప్రపంచ చరిత్ర తెలుగులో అనువాదానికి రాయల్టీ పంపనప్పుడు, మన సుబ్బరామయ్య గారికి ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఉత్తరాలు వస్తూండేవి. ఆయన హాస్యంగా మాతో, "చూడండర్రా, నెహ్రూ లాంటి వారు కూడా నన్ను డబ్బు పంపమని అడుగుతున్నారు." అని నవ్వేవారు.
సుబ్బరామయ్య గారు మంచి భోజన ప్రియులు. కాఫీ ఎన్నోసార్లు తాగేవారు. స్వీట్స్ ఇష్టం - ప్రత్యేకంగా గులాబ్జామ్. చెన్నపట్నంలో గోవిందప్ప నాయకన్ వీధిలో నేషనల్ లాడ్జ్ అనే ఆంధ్ర భోజనశాల ఉండేది. ప్రొప్రైటర్ నెల్లూరు వాస్తవ్యులు. రాత్రిపూట కొద్ది మంది అక్కడ భోజనం చేసేవారు. సుబ్బరామయ్యగారు తఱచుగా వెళ్ళటము, స్వతహాగా స్నేహశీలి అవటంతో అందరు ఆయనకి స్నేహితులయ్యారు. ఎండాకాలంలో బంగినపల్లి మామిడి పండ్లు తెచ్చి, భోజనశాల వారికి ఇచ్చి, పండ్లు ముక్కలుగా కోయించి, భోజనశాలలో అందరికి వడ్డించమనేవారు. 'మన' అనే పదము తప్ప 'తన' అనే పదము ఆయన నిఘంటువులో లేదనే చెప్పాలి.
'ద్రావిడ కళహం' పార్టీ వ్యవస్ధాపకులు శ్రీ ఇ.వి. రామస్వామి నాయికర్, మీరాన్ సాహిబ్ వీధిలో, సుబ్బరామయ్య గారి ఎదురింటిలో ఉండేవారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, రామస్వామి గారు, వారి సతీమణి, సుబ్బరామయ్య గారితో చాల స్నేహంగా ఉండే వారని ఆయన చెప్పేవారు.
స్వాతంత్ర్య ఉద్యమం రోజులలో నిర్భంధంలో వున్నప్పుడు ఆయన అనుభవాలను అడిగితే తనగురించి ఎక్కువ మాట్లాడేవారు కాదు. తనకన్నా ఎంతోమంది వారి జీవితాలను త్యాగం చేశారని, పోలీసు దౌర్జన్యాలకు బలయ్యారని, వారి సంపాదనలు, నగలు దేశానికి విరాళాలుగా ఇచ్చారని చెప్పేవారు. తాను చేసిన దేశసేవ ‘సముద్రంలో ఒక నీటి బొట్టు’గా భావించారు. స్వాతంత్ర్యము వచ్చిన దాదాపు 15 సంవత్సరాల తరవాత భారత ప్రభుత్వం వీరికి ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. స్వతహాగా స్వార్ధచింతన లేదు. అందువల్ల ఆ భూమిని ఉపయోగించుకొన లేకపోయారు.
సంస్థ మూసివేయబడింది. ఆర్థిక స్థోమత తగ్గింది. జీవితాన్ని కాచి వడబోసిన వ్యక్తిగా, పుస్తకమే తన ఊపిరి అని తలచి, దాదాపు 85 సంవత్సరాలు జీవన ప్రయాణం సాగించి తమ బంధువుల ఇంట తుది శ్వాసను విడిచారు.
ఫిబ్రవరి 1, 2021న కొత్తపల్లి సుబ్బరామయ్యగారి 111వ జయంతి.
గోవిందరాజు మదన్ మోహన్

oka goppa vyakthini gurinchi chaduvuthunnavaari manasulu spandinchela rachinchina vyasam.
రిప్లయితొలగించండిమీ అభిప్రాయానికి ధన్యవాదములు.
తొలగించండిPlease excuse me for responding in English. I am ashamed of this but I cannot help. My name is Sekharam, son of Kasturi Surya Prakasa Rao garu you mentioned in your article. Thank you for speaking so eloquently about my beloved Subbaramayya garu. He was a very intimate friend of our whole family from my birth. He used to visit us in Nidadavolu several times a year. He and my father used to sit in two easy chairs with newspapers spread all around them and break the shells and eat peanuts. We used to sneak around and grab a few peanuts. Every word you speak about him rings bells in my mind.
రిప్లయితొలగించండిWhen I came to USA in 1968, he vouched for me for a loan of Rs. 5,000 from Syndicate bank. Chalapati Rao garu, the uncle you mentioned in your article stayed with us for a few days in Chicago on his USA tour; I think it was sometime in the 80's.
As Lord Sri Krishna says in BhagavadGita, "స మహాత్మా సుదుర్లభః". May his soul rest in peace. May we all take inspiration from him.
Sekharam V Kasturi, thank you for your response.
తొలగించండి